Monday, September 5, 2011

కెరటం

నటీనటులు: సిద్దార్థ రాజ్‌కుమార్‌, ఐశ్వర్య, కవిత, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, భీమినేని శ్రీనివాసరావు, సుమన్‌, వేణుమాధవ్‌, ప్రదీప్‌, శిల్ప తదితరులు.
నిర్మాత: ఎస్‌.వి. బాబు, దర్శకత్వం: గౌతమ్‌ పట్నాయక్‌.


పాయింట్‌: యుక్తవయస్సులో కెరటంలా వచ్చే లవ్‌ కన్నా కెరీర్‌వైపు దాన్ని మళ్ళించమని చెప్పే కథ.

హ్యాపీగా కాలేజీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయడమే కాదు కెరీర్‌ను కూడా చూసుకుంటే ఎలా ఉంటుందనేది హ్యాపీడేస్‌ చిత్రం. అంత హ్యాపీగా కాలేజీలైఫ్‌ అనుభవిస్తూ... తన తోటివారంతా కెరీర్‌వైపు సాగితే తను మాత్రం లవ్‌ అంటూ అమ్మాయిల చుట్టూ తిరిగితే ఏమవుతుందనేది 'కెరటం'. కన్నడ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఎక్కువ భాగం కన్నడ నటీనటులే నటించారీ చిత్రంలో.

కథలోకి వెళితే...
సిద్దు (సిద్దార్థ రాజ్‌కుమార్‌) చలాకీ కుర్రాడు. కాలేజీ జీవితమంటే హాయిగా గడపటమే అనుకొంటాడు. అక్కడే చదివే ఏడుగురు స్నేహితులు. అందులో గీత (ఐశ్వర్య)తో స్నేహం ప్రేమాగా మారుతుంది. సరదా సాగే సిద్దు జీవితంలో ఆ కాలేజీలో చదివే రోబో చిచ్చు రేపుతాడు. గీత కావాలంటే బైక్‌ రేసులో పాల్గొనాలనేది రూల్‌. అలా పాల్గొని గెలుస్తాడు. దాన్ని అవమానంగా భావించి గీతను రోబో కెమిస్ట్రీ ల్యాబ్‌లో రేప్‌ చేయబోతాడు. ఇది తెలిసి సిద్దు ఆమెను రక్షిస్తాడు.

ఆ గొడవలో కరెంట్‌షాక్‌ తగిలి రోబో ఆసుపత్రిపాలవుతాడు. ఈ గొడవతో పోలీసులు రంగప్రవేశం చేస్తారు. దీంతో వారి తల్లిదండ్రులంతా సిద్దుకు దూరంగా పిల్లల్ని పెంచుతారు. తమకు కెరీర్‌ ముఖ్యమని అందుకే నీకు దూరంగా ఉంటున్నామని చెప్పినా సిద్దు లెక్కచేయడు. తను ప్రేమించిన గీత కూడా దూరమవుతుంది.

అయితే అదే సమయంలో ఆ కాలనీకి కొత్తగా వచ్చిన సంగీత(రకుల్‌ప్రీత్‌సింగ్‌)ను ప్రేమించేస్తాడు. ఇదే విషయాన్ని చెబితే... ఛీ కొడుతుంది. తనకంటూ పెద్ద డాక్టర్‌ అవ్వాలనే గోల్‌ ఉందని.. నీకేముందని అసహ్యించుకుంటుంది. మరోవైపు సిద్దు తండ్రి రిటైర్‌ అవుతాడు. ఆసరాగా వస్తాడనుకున్న కొడుకు అందిరాకపోవడంతో చేసేది లేక ఇంటి నుంచి గెంటేస్తారు. అదే టైమ్‌లో సిద్దు స్నేహితులు ఒక్కొక్కరు జీవితంలో ఎదిగి అదే కాలేజీలో సన్మానం చేయించుకుంటారు. ఇది తెలిసిన సిద్ధు ఏం చేశాడు? అనేది సినిమా.

కేవలం మంచి సందేశం ఇవ్వాలన్న తాపత్రయంలో దర్శకుడు, నిర్మాతలు సన్నివేశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కన్పించలేదు. అమ్మాయిని రేప్‌ చేసి చంపేయాలనుకున్న రోబో వంటి వ్యక్తి గురించి పోలీసుల ముందు సిద్దు స్నేహితులు కూడా చెప్పకపోవడం.. కేవలం రోబోను కావాలనే కొట్టినట్లుగా చెప్పించడం విడ్డూరంగా ఉంది. పతాక సన్నివేశంలో సిద్దు తల్లిదండ్రులు ఎందుకు కాలేజీకి వెళ్లారో స్పష్టత లేదు. తొలి భాగం కాలేజీ సన్నివేశాలు హ్యాపీడేస్‌ను గుర్తుకు తెస్తాయి.

వంశపారంపర్య నటుల్లో కృష్ణంరాజు వారసునిగా వచ్చిన సిద్దార్థ్‌ రాజ్‌కుమార్‌ డాన్స్‌లు బాగానే చేశాడు. ఐశ్వర్య ఫేస్‌లో హావభావాలు పెద్దగా కన్పించవు. సగటుజీవి గుమాస్తాగా భీమినేని శ్రీనివాసరావు బాగానే చేశాడు. సుమన్‌, కవిత పాత్రలు మినహా మిగిలినవారంతా కన్నడ నటీనటులే. జోస్వీ శ్రీధర్‌ సంగీతం గొప్పగా లేకపోయినా వినడానికి బాగున్నాయి.

యువతపై చిత్రాలు తీయాలనుకున్నప్పుడు మరింత శ్రద్ధ తీసుకోవాలి. వారంతా పబ్‌లు, ప్రేమలు అంటూ కాన్సెప్ట్‌లు చూపించి చివరికి ఒక సంఘటనతో మారిపోయేట్లు చూపించే చిత్రాలు చాలానే వచ్చాయి. ప్రధానంగా.. పిల్లల కెరీర్‌ను జాగ్రత్తగా పరిశీలించడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతైనా ఉందని చెప్పే చిత్రమిది. ఈ సందేశం బాగున్నా... కథనం మరింత ఆసక్తి గొలిపేది ఉంటే మరింతగా ఆకట్టుకునేది.

No comments:

Post a Comment